నీరు ఉపయోగాలు:
సాధారణంగా నీరు త్రాగడం మన శరీరానికి ఎంతో మంచిదని నిపుణులు చెపుతున్నారు. అదే నిపుణులు అతిగా నీరు త్రాగడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయని చెపుతున్నారు.  మన శరీర బరువులో సుమారు 60 శాతం నీరు ఉంటుంది. హృదయ, ఊపిరి మరియు జీర్ణ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి తగినంత నీరు అవసరం. ఈ నీరు రక్త కణాలకు పౌష్టికాలను సరఫరా చేస్తుంది. అంతే కాకుండా మెంబ్రేన్లు ఎండిపోకుండా తడిగా ఉండేలా చేస్తుంది. విష మరియు వ్యర్ధ పదార్ధాలను మాత్రం స్వేదం ద్వారా బయటకు విసర్జిమ్పజేస్తుంది. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అంతర్గతంగా మనిషికి నీరు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ నీరు త్రాగకపోతే మన శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు విషంగా పరిణమించి మరణం సంభవించే అవకాశం కూడ  ఉంది. మన మూత్ర పిండాలు యూరిక్ యాసిడ్ ను, యూరియా ను తొలగించినప్పుడు అవి నీటిలో కరిగి మూత్రం రూపంలో బయటకు వెలువడుతుంది. కాని తగినంత నీరు లేకపోతే వ్యర్ధాలు గడ్డ కట్టుకొని పోయి మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా జీర్ణ క్రియలో రసాయనిక ప్రతిస్పందనలకు నీరు ఎంతో ప్రధానమైనది. ఈ నీరు మన శరీర ఉష్ణోగ్రతలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది. కీళ్ళు పొడిబారిపోయి కీళ్ళనొప్పులు రాకుండా నీరు చేస్తుంది.
తీసుకోవాల్సిన నీటి మోతాదు:
చాలా మందికి ఎంత నీటిని తీసుకోవాలో అవగాహన లేదు. చాలా మంది కావాల్సినంత నీటిని తాగరు. రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం మంచిది. ఒకవేళ ఎక్సర్సైజులు, జాగింగ్ మరియు ఎరోబిక్స్ చేస్తున్నట్లయితే వారు మరో నాలుగు గ్లాసుల నీటిని అదనంగా త్రాగాలి. ముఖ్యంగా గర్భిని స్త్రీలు, పాలు ఇచ్చే మహిళలు ఎక్కువ నీటిని తీసుకోవాలి. జ్వరం, విరోచనాలు, మూత్రనాలంలో రాళ్ళు ఉన్నవారు సాధ్యమైన మేరకు ఎక్కువగా నీటిని త్రాగాలి.
నీరు తగినంత తీసుకుంటున్నారో లేదో తెలుసుకొనే పరీక్ష:
నీరు తగినంత మోతాదులో తీసుకుంటున్నారో లేదో తెలుసుకొనుటకు ఒక సారి ఎవరి మూత్రాన్ని వారు పరిశీలించుకోవాలి. అది యాపిల్ రసంగా ఉంటే దానిలో సాంద్రత ఎక్కువ ఉన్నట్లు అనగా శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉందన్నమాట. మూత్రం తెల్లగా, వాసన లేకుండా, పలుచగా ఉంటే శరీరంలో తగినంత మోతాదులో ద్రవ పదార్ధాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాంతులు, వికారం, వాపులు మరియు తల తిరగడం వంటివి ఉంటే శరీరంలో తగినంత నీరు లేదని చెప్పవచ్చు.
నీటి గురించి ఇతర విషయాలు:
ఒక వ్యక్తికి బాగా దాహం వేస్తున్నదంటే అతనిలో ఒక శాతం నీరు తగ్గిందని చెప్పవచ్చు. సాధారణంగా ఎక్సర్సైజులు చేసేవారు స్పోర్ట్స్ డ్రింక్ త్రాగడం ద్వారా వారి శరీరంలోని సోడియం సాధారణ స్థాయికి తెచ్చుకొంటారు. సాధారణంగా ఒక వ్యక్తి ఎక్సర్సైజుల ద్వారా బరువు తగ్గాడంటే అది కేవలం అతని శరీరంలో నీరు శాతం తగ్గడమే కారణం. కాని క్రొవ్వు అంత సులభంగా కరగదు.  తీసుకొనే నీరు ఎల్లప్పుడు గది ఉష్ణోగ్రతతో సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. అతి శీతలమైన నీరు అజీర్తికి దారి తీస్తుంది. ఆరోగ్ర్యంగా ఉన్న వ్యక్తి రోజుకు 8  నుండి 12  గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ త్రాగితే 'వాటర్ ఇంటాక్సినేషన్' వస్తుంది. అనగా రక్త నాళాలలో సోడియం పరిమాణం తగ్గడం ద్వారా ప్రమాదక పరిస్థితులు ఏర్పడతాయి.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments