ఐన్ స్టీన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మరియు అతను గొప్ప శాస్త్రవేత్త అని. ఆయన జీవితాన్ని వివిధ కోణాలలో తొంగిచూస్తే కొన్ని నిజాలు బయటపడతాయి. అవి ఏమిటంటే ఆయన ముఖ్యంగా శాంతి సామరస్యాలను కోరుకొనే వ్యక్తి. ఎందుకంటే పాలస్తీనా విభజనకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయాల్సిందిగా భారత్ తొలి ప్రాధాని జవహర్ లాల్ నెహ్రును ఐన్ స్టీన్ కోరారు. "న్యాయం, సమానత్వం" వైపు మొగ్గు చూపాలని ఆయన దేశ నాయకులను కోరారు. ఐన్ స్టీన్ రాజకీయాలకు అతీతంగా పాలస్తీనా విషయంలో స్పందించిన తీరు అతనికి ఇతర దేశాల పట్ల గల ఔదార్యాన్ని తెలియజేస్తుంది.
ఒకప్పుడు ఒక హిందూ విలేఖరి ఐన్ స్టీన్ వద్దకు వచ్చి హైడ్రోజన్ బాంబు ఉత్పత్తి నిలిపేన్తవరకు నిరాహారదీక్ష చేయవలెనని ఐన్ స్టీన్ కు లేఖలో సూచించారు. కాని దానికి సమాధానంగా ఐన్ స్టీన్  "లేఖలో రాసిన విషయం ప్రకారం సూచించినందుకు అభినందనలు. భారతీయ మనస్తత్వం గల ప్రజల మధ్య మీరు నివసిస్తున్నారు. కాబట్టి మీకా పద్ధతి మంచిదని అన్పించవచ్చు. కాని అమెరికన్ ప్రజలు మనస్తత్వం తెలుసుకుంటే మీరు సూచించిన పద్ధతి వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని అనుకోవడం లేదు. అంతే కాకుండా అది అహంకార వ్యక్తీకరణగా కన్పించవచ్చు. అంత మాత్రాన గాంధీజీ పైన మరియు భారతీయ సాంప్రదాయంపైన ఆరాధన భావం లేదని కాదు. అంతర్జాతీయంగా భారత్ అవలంభిస్తున్న విధానం అలీన దేశాల ఐక్యతకు శాంతి సామరస్య పరిష్కారానికి బాటలు వేయగలదని ఆశిస్తున్నాను." అని హిందూ విలేఖరికి లేఖలో ప్రత్యుత్తరం ఇచ్చారు.
ఐన్ స్టీన్ మరియు నెహ్రూకు మధ్య జరిగిన చివరి ఉత్తర సంబంధంలో తైవాన్ లో చైనా కమ్యూనిస్టులకు, నేషనలిస్టు ప్రభుత్వానికి మధ్య చైనా ఆగ్నేయ తీరంలో ఉన్న క్యూమర్, మట్సు దీవులపై జరుగుతున్న వివాద పరిష్కారానికి జోక్యం చేసుకోవలసిందిగా ఐన్ స్టీన్ ఒక లేఖలో నెహ్రూను కోరారు. అయితే ఆ లేఖకు నెహ్రూ సమాధానం ఇచ్చారో లేదో మాత్రం తెలియదు.
ఐన్ స్టీన్ మరియు గాంధీజీకి మధ్య ఉన్న సంబంధం అతి సున్నితమైనది. వారిద్దరు ఎప్పుడు ముఖాముఖి మాట్లాడుకోలేదు. అయితే ఒకసారి 1929 లో గాంధీ గారిపై తన గౌరవ భావాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. గాంధీ గారిని ముఖాముఖి కలుసుకోకపోయిన గాంధీజీ, ఐన్ స్టీన్ కు మధ్య ప్రత్యుత్తరాలు జరిగేవి. 1931 లో వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మొదటి సారిగా ప్రారంభమయ్యాయి. ఐన్ స్టీన్ తన మొదటి లేఖను గాంధీ గారి సన్నిహితుడైన సుందరం అనే వ్యక్తి ద్వారా గాంధీ గారికి పంపించారు. ఆ ఉత్తరాన్ని పంపేటప్పుడు ఐన్ స్టీన్ జర్మనీలోని బెర్లిన్ లో ఉన్నారు. ఆ సమయంలో భారత రాజ్యంగ సంస్కరణలపై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వడానికి గాంధీజీ లండన్ వెళ్ళారు. 1931 సెప్టంబర్ లో గాంధీ గారికి రాసిన ఉత్తరంలో "హింస లేకుండా లక్ష్యాలను సాధించవచ్చు అని చూపించి  అందరికీ ఆదర్శంగా నిలిచారు. హింసా విధానాలను ఆహిమ్సాపద్ధతిలో జయించవచ్చు. మీ అడుగు జాడలు మానవాళికి ఎంతో స్పూర్తిని ఇస్తాయి. హింసతో కూడిన ఘర్షణ అంతమొందించి ప్రపంచ శాంతిని నెలకొల్పవచ్చని మీరు నిరూపించారు." అని ఐన్ స్టీన్ రాశారు. దీనికి ప్రత్యుత్తరంగా గాంధీ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. "సుందరం ద్వారా మీరు పంపిన ఉత్తరంను చదివి నేను ఎంతో ఆనందించాను. నేను చేస్తున్న పని మీకు ఆదర్శంగా కన్పించినందుకు నా కెంతో సంతోషం కలిగింది. మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకోవాలని ఉంది. అది కూడా నా ఆశ్రంలో కలుసుకోవాలని ఉంది.".
70 వ జన్మ దినం సందర్భంగా గాంధీ గారి గురించి వెలువడే పుస్తకంలో వారి గురించి ఒక వ్యాసం రాయమని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఐన్ స్టీన్ ను అభ్యర్ధించారు. దానికి ఐన్ స్టీన్ రాసిన వ్యాసం ఇలా ఉంది. "రాజకీయ చరిత్రలో మహాత్మ గాంధీ జీవితం మరియు వారి కృషి అద్వితీయమైనది. అణగారిన ప్రజల విముక్తి కోసం విన్నూతమైన మానవీయ మార్గాన్ని కనిపెట్టారు. ఆ మార్గాన్ని గొప్ప శక్తితో, అంకితభావంతో ఆచరించారు. హింసా, రాక్షస మార్గాలతోనే ఏదైనా సాధించవచ్చన్న మన తరం అభిప్రాయాలను తలక్రిందులు చేస్తూ ఆలోచించగల వ్యక్తుల మనస్సుల్లో అహింసా భావాలు గాంధీ గారి వల్ల పెంపొందాయి."


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments