చలనమనగా కదలిక, చిత్రమనగా బొమ్మ. కడలియాడెడి బొమ్మ అనే చలనచిత్రములని యందురు. ఆంగ్లములో వీనిని సినిమాలందురు.  మానవులకు తిండి, బట్ట, నీరు, గాలి, ఇల్లు యెంత అవసరమో మానసికోల్లసము, వినోదముగూడ నంటే అవసరము. ఇందుకోసమై పూర్వకాలం నుండి అనేక ప్రక్రియలు వాడుకలోని వచ్చినవి.  సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, శిల్పము, కవిత్వము హృదయానందము కలిగించును.
ఆటపాటలు, భామాకలాపము, గొల్లసుద్దులు, వీధి నాటకములు, యక్షగానములు, బుర్రకధలు, తోలుబొమ్మలాట లనునవి మన దేశమునందు ప్రజలకు వినోదమును, విజ్ఞానమును, కలిగించుచుండెడివి .


ఆధునిక యుగమునందు విజ్ఞానశాస్త్ర పరిశోధనల వలన ఎన్నో అద్బుతములు జరిగినవి.  వానిలో చలనచిత్రముల ఆవిర్భావము ఎన్నదగియున్నది.  ధామన్ అల్వాఎడిసన్ అను  శాస్త్రవేత్త ౧౮౮౦లొ చలనచిత్ర పద్ధతి కనిపెట్టెను.  క్లెస్సరు అను జర్మను జాతీయుడు దానిని అభివృద్ది పరచెను.  మొదట మ్యాజిక్ సహాయముతో తెరపై బొమ్మలను చోపించి కధ చెప్పెడివారు.


తరువాత కదలుచున్న బొమ్మలను సేల్యులాయిడ్ పై ముద్రించి విధ్యుచ్చక్తితో ప్రొజెక్టరు సహాయమున తెరపై ప్రదర్శించసాగిరి. తొలిదశలో మాటలు, పాటలు లేని వీనిని మూగ సినిమాలానేడివారు.  కాలక్రమమున ధ్వనిని గూడ జోడించి ప్రదర్శించుట ప్రారంభమైనది.  వీనిని "టాకీ" లందురు.  క్రమంగా రంగుల చిత్రములు, సినిమా స్కోపు పద్ధతి వాడుకలోనికి వచ్చినవి.  నేడు ప్రపంచమందు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, లక్షల కొలది పనివారితో, వేలాది నటీనట వర్గముతో, పంపినీదారులతో, ప్రదర్శకులతో సినిమారంగము గొప్ప పరిశ్రమగా రూపొందినది.  ప్రతిదేశమునందు సినిమా పరిశ్రమ ముందంజ వేసి ప్రపంచ దేశముల నడుమ సాంస్కృతిక దూతగా వర్దిల్లినది.


మన దేశమునందు తొలి చలనచిత్రము బొంబాయి నగరమునందు ౧౯౧౮లొ ప్రదర్శితమైనది.  మాటల సినిమా ౧౯౨౮లొ ప్రదర్శించబడినది.  ఆనాటినుండి మనదేశమునందు బొంబాయి చలన చిత్రపరిశ్రమకు ప్రధాన కేంద్రముగా నున్నది.  కలకత్తా, మద్రాసు, హైదరాబాదు, బెంగుళూరు నగరములలో గూడ చలనచిత్ర నిర్మాణము జరుగుచున్నది.  మద్రాసు దక్షిణ భారతీయ భాషా చిత్ర నిర్మాణమునకు ముఖ్య కేంద్రముగా నున్నది.  ఇచ్చట తమిళము, కన్నడము, మలయలములందు ఏటేటి వంద చిత్రములకు పైగా నిర్మించబడుచున్నవి. బొంబాయి నగరమునందు ప్రధానముగా హిందీ చిత్రములను తయారుచేయుచున్నారు. పౌరానికము, చారిత్రకములు, సాంఘికములు, అపరాధ పరిశోధనాత్మకములు, వార్తా చిత్రములని అనేక బేధములున్నవి.  తెలుపు, నలుపు చిత్రములు, రంగుల చిత్రములు అని పలుభేదములున్నవి.  చిత్రములను నిర్మించి నిర్మాత, దర్శకులు, నటీనటులు, సాంకేతిక వర్గము, పంపిణీదారులు, ప్రదర్శకుల లక్షల సంఖ్యలో ఈ పరిశ్రమమీద ఆధారపడి జీవించుచున్నారు.


చలన చిత్రములో సంగీతము, కవిత్వము, నాట్యము, శిల్పము, చిత్రకళ, మేళవించి ప్రేక్షకులకు వినోదమును కలిగించును.  విన్న దాని కన్నా కన్నులార చూచునది మనోహరమై శాశ్వతముగా గుర్తుండును.  విజ్ఞానాత్మక విషయములు గూడ చలనచిత్రములో చూచి జ్ఞానమును పొందవచ్చును.  కధాచిత్రములు, వార్తాచిత్రములు, శాస్త్రజ్ఞానాత్మకములు, అద్భుత సాహసాత్మకములు, దేశాభివృద్ధి, ప్రబోధాత్మకములయిన ఈ చలన చిత్రములు పండితులను, పామరులను, స్త్రీలను, పురుషులను, అన్ని తరగతుల వారిని ఆనందింపజేయుచున్నవి.  మనము పోయి చూడజాలని అనేక ప్రదేశములను, దృశ్యములను, సంఘటనలను చలనచిత్ర సహాయమున చుదగులుగుట వలన ఎంతో లాభము పొందగలము.  విద్యార్ధులకు విధ్యావిషయములను బోధించు చిత్రములు గూడ నిర్మించబడుచున్నవి.


ఆధునిక యుగమునందు ప్రచార సాధనములలో చలన చిత్రములు చాలా బలీయమైనవి.  నిత్యము లక్షలకొలది ప్రేక్షకులు సినిమాలను చూచి ప్రభావితులగు చున్నారు.  ఉత్తమాభిరుచిగల నిర్మాతలు కలాఖందములన దగిన చిత్రములను నిర్మించి కళాసేవ చేయుచున్నారు. కాని పెక్కురు దీనిని కేవలము ధనార్జన దృష్టితో చేపట్టుచు, ధనసంపాదన కవసరమైన తరహాలో చిత్రనిర్మాణము చేయుచున్నారు.  దానివలన కళాదృష్టి, నైతిక బలము లోపించినవి.  కేవలము కామము, అసభ్య శృంగారము, శ్లేష గర్భిత గీతములు, హత్యలు, దోపిడీలు, మానభంగములు, క్రౌర్యము, హింసవంటి అవాంచనీయ విషయములే నేటి చలన చిత్రములలో కనిపించుచున్నవి.  ఇందువలన ముక్కుపచ్చలారని బాలబాలికలు, యువతీ యువకులు తప్పుదారి త్రొక్కుచున్నారు.  చలన చిత్రములలో వాస్తవి కత పేరుతో ఘోర దృశ్యములు చిత్రించుటచే సమాజమున అవినీతి ప్రబలుచున్నది.  వేషము, భాష తీర్చిదిద్దుటలో సినిమాలే ఆదర్శప్రాయములైనవి.  ఒక వింతను సినిమాలో చూచినంతనే మరునాడు దానిని నిజజీవితమునుందు అనుసరించుచు కష్టముల పాలగుచున్నారు.   కనుక ఈ ధోరణీ తొలగిపోవలెను.


ప్రభుత్వము సెన్సారు బోర్డును స్థాపించినది.  అది మనజాతి సంస్కృతీ, నాగరికతలను గుర్తించి వానికి గౌరవమ్ తెచ్చు విధముగా చలన చిత్ర నిర్మాణము జరుగునట్లు చూడవలెను.  విజ్ఞానమును, వినోదమును చౌకగా అందించు ఈ సార్వజననీ వినోద సాధనమును సరియైన త్రోవలో నడిపించవలెను.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments