యదార్ధ సంఘటన: ఈ వ్యాసములో ఉన్నది యదార్ధ సంఘటన అదేమిటంటే హైదరాబాద్ లో బాగాలింగంపల్లి అనే పేరు వినగానే గుర్తుకువచ్చే పేరు ఎలక్ట్రీషియన్ ప్రభాకర్ ఇల్లు.  ఎందుకంటే వేసవికాలం వస్తే చాలు వారి ఇంటి ముందు పేదలు  వారి ఇంటి అంబలి  కోసం బారులు తీరి ఉంటారు.  ఏప్రిల్ 25 నుంచి ప్రభాకర్ అంబలి పోయటం ప్రారంభం అవుతుంది. సుమారుగా ముప్పై రెండు ఏళ్ళ క్రిందట ప్రభాకర్ తల్లి అయిన సులోచన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సులోచన దంపతులు ఏదో ఒకవిధంగా పేదలకు సాయం ఎల్లపుడు చేసేవారు.  ఓ రోజు సులోచన తన మనస్సులో 'వేసవిలో ఇంట్లో ఉండి మనమే తట్టుకోలేక పోతున్నామే. అలాంటిది కూలీలు, భిక్షాటన చేసేవాళ్ళ పరిస్థతి ఏమిట'ని ఆలోచించింది.  ఆ రోజు నుంచి ఆమె రాగి పిండితో జావా కాచి చుట్టుప్రక్కల ఉన్న పేదలకు పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయములో ఆమె కొడుకు ప్రభాకర్ కూడా తల్లి సేవలో పాలుపంచుకోనేవాడు. కాని కొన్నేళ్ళ క్రిందట సులోచన చనిపోయింది. కాని ప్రభాకర్ మాత్రం తల్లి ఆలోచనను మర్చిపోలేదు. ఆమె మొదలు పెట్టిన కార్యక్రమాన్ని నిరాటంకంగా బాధ్యతగా కొనసాగిస్తున్నాడు.  ఆయన భార్యపిల్లలు కూడా ఆ అంబలి పంచుకొనే కార్యక్రమములో పాలుపంచుకుంటున్నారు. ఈ అంబలి ఎందుకు? ఈ అంబలి తయారీని ప్రభాకర్ ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తారు.  రాగులు కొని వాటిని శుభ్రం చేసి మర పట్టించి,  కట్టెలు మరియు బియ్యం సమకూర్చుకుంటారు.  ప్రతి రూజు సుమారు 8  కిలోల పిండితో సుమారు 50  లీటర్లు అంబలి తయారుచేసుకుంటారు. మరియు అందులో నూకలు కలుపుతారు. ఇలా చేసిన జావా వేసవి కాలంలో వడ దెబ్బ తగలకుండా చేస్తుంది. బీపి ఉన్నవాళ్ళు కూడా అంబలిని త్రాగవచ్చు. దాహం తీర్చుకోవడానికి కూడా ఈ అంబలి ఉపయోగపడుతుంది.  కాబట్టి ఏప్రిల్ 24 తారీఖున అటు ఇటు గా మొదలు పెట్టి సుమారుగా 45 రోజుల పాటు అంబలిని ప్రభాకర్ గారు పేదవారికి పంపిణీ చేస్తారు.  ఈ అంబలిని త్రాగడానికి బాగాలింగంపల్లిలో లంబాడి బస్తి, భగత్ సింగ్ నగర్ అచ్చట వుండే పేదలు ఉదయం ఎనిమిది గంటల కల్ల ప్రభాకర్ ఇంటికి చేరుకుంటారు.  ప్రభాకర్ భార్య కృష్ణవేణి ఉదయం నాల్గింటి కల్ల లేచి రాగి పిండిని కలిపి, సుమారుగా రెండు గంటల పాటు పొయ్యిపై అంబలిని కాస్తూ ఉంటుంది. ఎవరైనా ఆమెను అన్ని రోజుల పాటు ఉదయం లేవటం కష్టంగా భావించుట లేదా అని అడిగితే ఆమె చెప్పే సమాధానం ' నేను కోడలిగా ఈ ఇంటికి వచ్చేనాటికే ఈ సంప్రదాయం ఉన్నది. అప్పట్లో ఆ బాధ్యతను మా అత్తయ్య చూసుకునేవారు. అప్పుడు నేను కూడా ఆ బాధ్యతలో పాలుపంచుకునేదాన్ని. ఇప్పటికి కూడా నేను అలానే భావిస్తున్నా. నేను పడే కష్టమును పేదవారు ఎప్పుడైతే అంబలిని త్రాగి దాహమును తీర్చుకుంటారో అప్పుడు నేను పొందే ఆనందం మరియు సంతృప్తిలో చూసుకుంటాను. ఆ ఆనందం మరియు సంతృప్తితో పోలిస్తే ఈ కష్టం ఏ పాటిది' ప్రభాకర్ దంపతుల పిల్లలు వచ్చిన పెద్దలను మరియు పిల్లలను వరుసలో నిలబెట్టి, గిన్నెలు తెచ్చుకోని వారికి గ్లాసులు ఇస్తారు. అక్కడ ఊడ్చే స్వీపర్లు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్ల వచ్చి తమకు ఉంచిన అంబలిని త్రాగి దాహమును తీర్చు కుంటారు. ఎవరైనా విరాళాలు ఇవ్వటానికి ముందుకు వస్తే ప్రభాకర్ గారు సున్నితముగా తిరస్కిస్తారు. ఈ సహాయము చేయటం కోసం ఎంత ఖర్చు అవుతుందో చెప్పటానికి ప్రభాకర్ గారు ఇష్టపడరు.  అంబలి పంపిణీ చివరి రోజు పరమాన్నం, రవ్వకేసరి వంటి స్వీట్లు పేదవారికి పంచుతారు. ఈ స్వీట్లు కంటే వారి మనసులు ఎంతో తీపి అని అర్ధమౌతుంది.

Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments